Retirement @33yrs - 33 ఏళ్ల సర్వీసుకే పదవీ విరమణ? ప్రజాప్రయోజనాల పేరుతో ఇంటికి పంపే నిబంధన జీపీఎస్‌ బిల్లులోనే ప్రస్తావించిన జగన్‌ ప్రభుత్వం - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

Retirement @33yrs - 33 ఏళ్ల సర్వీసుకే పదవీ విరమణ? ప్రజాప్రయోజనాల పేరుతో ఇంటికి పంపే నిబంధన జీపీఎస్‌ బిల్లులోనే ప్రస్తావించిన జగన్‌ ప్రభుత్వం

9/28/2023

 33 ఏళ్ల సర్వీసుకే పదవీ విరమణ?

ప్రజాప్రయోజనాల పేరుతో ఇంటికి పంపే నిబంధన

జీపీఎస్‌ బిల్లులోనే ప్రస్తావించిన జగన్‌ ప్రభుత్వం

పాత పింఛను నిబంధనకు ఇప్పటికీ చోటు

నోరెత్తని ఉద్యోగసంఘాల నేతలు

ఈనాడు, అమరావతి: 

*ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులను ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం తప్పనిసరిగా పదవీవిరమణ చేయిస్తుందా? అందుకు 33 ఏళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకోబోతోందా?* రాష్ట్ర శాసనసభలో ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన గ్యారంటీ పింఛను పథకం బిల్లులోనే ఈ అంశం ఉంది. సీపీఎస్‌ను రద్దుచేస్తామని హామీ ఇచ్చిన జగన్‌.. ఇప్పుడు దానిస్థానే జీపీఎస్‌ను ప్రవేశపెట్టారు. అందులో ఉన్న ఈ నిబంధన చర్చనీయాంశమవుతోంది. జీపీఎస్‌ బిల్లులో ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే ఎంత సర్వీసు ఉండాలనే అంశాలు స్పష్టంగా పేర్కొన్నారు. అందులోని నాలుగో భాగం ఒకటో అంశంలోని సి నిబంధన ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. *''ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఉద్యోగులతో ప్రభుత్వం పదవీ విరమణ చేయిస్తే.. అలాంటి ఉద్యోగులకు కనీసం 33 సంవత్సరాల అర్హత సర్వీసు ఉంటేనే''* ఈ గ్యారంటీ పింఛను పథకం ప్రయోజనాలు అందుతాయని జగన్‌ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ప్రభుత్వోద్యోగుల సవరించిన పింఛను రూల్స్‌ 1980లో ఉన్న నిబంధన 44 ప్రకారం ఇక్కడ ఈ అంశం చేర్చినా... ఇప్పుడు దాని అవసరమేంటన్న ప్రశ్న వస్తోంది. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసు 62 సంవత్సరాలు. సర్వీసుతో పదవీ విరమణకు సంబంధం లేదు.


*ప్రజాప్రయోజనాలతో ఉద్యోగులను పదవీవిరమణ చేయించడం అన్నది ఇంతవరకు అమల్లో లేనిది. పింఛను రూల్స్‌లో ఎప్పుడో ఉన్న ఈ నిబంధనను జీపీఎస్‌లో చేర్చడమే విశేషం.* ఉద్యోగులంతా పాత పింఛను విధానం కావాలని అడిగినా అది ఇవ్వకపోగా.. ఉద్యోగులను ఇబ్బంది పెట్టే నిబంధనలు తీసుకొచ్చి జీపీఎస్‌లో పెట్టడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. ''సాధారణ పరిస్థితుల్లో ఇది ఎప్పటి నుంచో ఉన్న పింఛను రూల్‌ కావచ్చు. కానీ కొన్నేళ్లుగా చోటు చేసుకున్న పరిణామాల్లో ఇది గుబులు రేపుతోంది'' అని కొందరు ఉద్యోగులు పేర్కొంటున్నారు. గతంలో కేంద్రప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ విషయంలో కొన్ని అంశాలు ప్రచారంలోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉద్యోగుల పదవీవిరమణకు వయసు మాత్రమే కాకుండా సర్వీసునూ పరిగణనలోకి తీసుకుంటారన్న చర్చ జరిగింది. కొంత సర్వీసు పూర్తయ్యాక, వారి పనితీరు సరిగా లేకుంటే పదవీవిరమణ చేయించే ఆలోచన కేంద్రప్రభుత్వం చేస్తోందన్న చర్చ సాగింది. ఈ ఏడాది జూన్‌లో లోక్‌సభలో కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌ ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్రప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసును మార్చే ఆలోచన, కొత్త విధానం తీసుకువచ్చే ప్రతిపాదన ఏదీ లేదని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రయోజనాల రీత్యా ఉద్యోగులను పదవీవిరమణ చేయించడం అన్న నిబంధన ఈ జీపీఎస్‌ బిల్లులో ఎందుకు ఉపసంహరించలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.


నాడు హడావుడి... నేడు మౌనం:

 ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వ హయాంలోనూ ఉద్యోగుల పదవీవిరమణపై కొంత హడావుడి జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీవిరమణ వయసును 30 ఏళ్ల సర్వీసు లేదా 55 ఏళ్ల వయసుగా మార్చబోతున్నారంటూ నాడు కొందరు ప్రతిపక్ష నాయకులు, వారికి సన్నిహితంగా ఉండే ఉద్యోగసంఘ నాయకులు హడావుడి చేశారు. సాధారణ పరిపాలనశాఖ దీనిపై ఫైలు సిద్ధం చేసిందని హల్‌చల్‌ చేశారు. అప్పట్లో సాధారణ పరిపాలనాశాఖ కార్యదర్శి తన శాఖ అధికారులను పదవీ విరమణకు సంబంధించిన కొంత సమాచారం అడిగి వివరాలు పంపాలని నోట్‌ పెట్టారు. కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నాడు జరిగిన ప్రచారం నేపథ్యంలో ఈ వివరాలు కోరారు. అప్పట్లో దీనిపై చర్యలేవీ లేకున్నా... కేవలం సమాచారం అడిగినందుకే ఆ ఉద్యోగ సంఘ నాయకులు వివాదం సృష్టించారు. ఇప్పుడు జీపీఎస్‌ బిల్లులో ఈ నిబంధన చేర్చినా ఉద్యోగసంఘ నాయకులు ఎవరూ నోరు మెదపకపోవడం విశేషం.

close