పాదచారులను వాహనాలు ఢీ కొట్టకుండా.. త్వరలోనే వాహనాల్లో ప్రమాద హెచ్చరికలు - Andhrashakthi.in

Mobile Menu

Top Ads

More News

logoblog

పాదచారులను వాహనాలు ఢీ కొట్టకుండా.. త్వరలోనే వాహనాల్లో ప్రమాద హెచ్చరికలు

11/12/2023

 పాదచారులను వాహనాలు ఢీ కొట్టకుండా.. త్వరలోనే వాహనాల్లో ప్రమాద హెచ్చరికలు..

త్వరలోనే వాహనాల్లో ప్రమాద హెచ్చరికలురోడ్డు రవాణా శాఖ ప్రతిపాదనలు

పాదచారులు, సైకిళ్లపై వెళ్లేవారిని ఢీ కొట్టకుండా ఉండేందుకు నిర్దిష్ట విభాగాలకు చెందిన 4 చక్రాల ప్రయాణికుల, వాణిజ్య వాహనాల్లో ప్రమాద హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేయాలని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.

దీని కింద వాహనాల్లో 'మూవింగ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(ఎమ్‌ఓఐఎస్‌)ను ఇన్‌బిల్ట్‌గా అమరుస్తారు. ఆ మేరకు ఒక ముసాయిదాను సిద్ధం చేసింది. ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం దీనిని నోటిఫై చేసే అవకాశం ఉంది.


ఎలా పనిచేస్తుంది?: ఎమ్‌ఓఐఎస్‌ అంటే.. వాహనానికి దగ్గర్లో పాదచారులు, సైక్లిస్టులు ఉంటే అది గుర్తించే వ్యవస్థ. దీంతో పాటు ఆ సమాచారాన్ని చోదకుడికి చేరవేస్తుంది. ముఖ్యంగా ఎమ్‌2, ఎమ్‌3, ఎన్‌2, ఎన్‌3 విభాగాలకు చెందిన వాహనాలు.. పాదచారులు, సైకిలిస్టులను(ముఖ్యంగా పిల్లలు) ఢీ కొట్టకుండా ఈ వ్యవస్థ హెచ్చరికలు జారీ చేయగలదని ఆ ముసాయిదా నివేదిక పేర్కొంది. ఇప్పటికే ఈ ప్రమాదాల బారినపడడానికి అవకాశం ఉన్న రోడ్డు వినియోగదార్ల(వీఆర్‌యూలు) భద్రత కోసం వాహనం ముందు ప్రాంతం కనిపించేలా మిర్రర్ల సంఖ్యను పెంచారు. అయినప్పటికీ ప్రమాదాలు జరుగుతుండడంతో అధునాతన వ్యవస్థ ఏర్పాటుకు మొగ్గుచూపుతున్నట్లు ముసాయిదా పేర్కొంది. 2022లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో వెనక నుంచి ఢీ కొట్టడం వల్ల జరిగిన మరణాలు 19.5 శాతంగా ఉన్నాయి. 


విభాగాలు ఇలా..


ఎమ్‌2: ఈ విభాగంలోని వాహనం(బస్సు)లో డ్రైవరు సీటు కాకుండా.. 8 కంటే ఎక్కువ సీట్లుంటాయి. అయితే ఇది 5 టన్నుల కంటే తక్కువ బరువుంటుంది.

ఎమ్‌3: ఎమ్‌2 లాగే 8 సీట్లుంటాయి కానీ.. 5 టన్నుల కంటే ఎక్కువ బరువుంటే ఈ విభాగం కిందకు వస్తాయి.

ఎన్‌2: వస్తువులను తీసుకెళ్లే వాహనాలు 3.5 టన్నుల కంటే ఎక్కువ బరువుండి.. 12 టన్నుల కంటే తక్కువే ఉంటే ఈ విభాగం కిందకొస్తాయి.

ఎన్‌3: 12 టన్నుల కంటే అధిక బరువుండే వాణిజ్య వాహనాలు.

close