Tirumala: తిరుమల కొండపై ఈ తప్పులు అస్సలు చేయకండి.. పెళ్లైన 6 నెలల వరకూ..
మోసం చేసి దర్శనం: రోజూ స్వామివారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు క్షేత్రానికి చేరుకుంటారు. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి అనేక రకాల సదుపాయాలను టీటీడీ ఏర్పాటు చేసింది.
అయితే కొందరు స్వామివారిని దర్శించుకోవడనికి అడ్డదారులు ఆశ్రయిస్తూ ఉంటారు. దొంగ తనంగా, లేదా ఇతరులను మోసం చేసుకుని దర్శనం చేసుకుని సంతోషపడతారు. అయితే ఇలాంటి భక్తులను స్వామివారు అనుగ్రహించారని.. దర్శన ఫలం దక్కదని విశ్వాసం.
తిరుమల క్షేత్రానికి మరో పేరు ఆది వరాహ క్షేత్రం. కొండపైకి చేరుకున్న తర్వాత చాలామంది మలయప్ప స్వామిని దర్శించుకుంటారు. అయితే వాస్తవానికి తిరుమల కొండపై అడుగు పెట్టిన వెంటనే స్వామివారిని దర్శించుకోవడం కాకుండా.. ముందుగా వరాహ స్వామిని దర్శించుకోవాలి. భూదేవి రక్షించడం కోసం వరాహస్వామి అవతారం ఎత్తిన విష్ణు మూర్తి .. అనంతరం తిరుమల కొండపై కొలువై ఉన్నాడు. కాలక్రమంలో విష్ణుమూర్తి తనను వీడిన లక్ష్మీదేవిని వెదుక్కుంటూ భూలోకానికి చేరుకున్నాడు.
ఆ సమయంలో తిరుమల కొండపై నివసించడానికి 100 అడుగుల స్థలం ఇవ్వమని వరాహస్వామి కోరినట్లు.. అప్పుడు తనకు మొదట పూజ, నైవేద్యం ఇవ్వాలని కండిషన్ పెట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల కొండపై ఉండడానికి అంగీకరించాడని పురాణాల కథనం. స్వామివారి ఇచ్చిన వరం ప్రకారం.. స్వామివారిని దర్శించుకోవడానికి ముందు వరాహస్వామిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది.
విహార యాత్రగా భావించరాదు: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రానికి వెళ్లే భక్తులు పవిత్ర భావనతో వెళ్ళాలి. ఏదో విహార యాత్రకు వెళ్లినట్లు భావించరాదు. అంతేకాదు ఐహిక సుఖాలను ఈ క్షేత్రంలో తలవరాదు. అందుకనే పెద్దలు తిరుమల క్షేత్రానికి పెళ్లైన కొత్త జంట.. ఆరు నెలల వరకూ వెళ్లరాదనే నియమం పెట్టినట్లు తెలుస్తోంది.
మాడ వీధుల్లో : తిరుమల శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న నాలుగు వీధులను మాఢవీధులు అంటారు. స్వామివారు ఈ మాఢవీధుల్లో విహరిస్తూ ఉంటారు. ఈ వీధులను పరమ పవిత్రంగా భావిస్తారు. అందుకనే ఈ మాఢవీధుల్లో ఎటువంటి వారైనా సరే చెప్పులతో తిరగడం నిషేధం.. అంతేకాదు ఈ వీధుల దగ్గర చెప్పులు ధరించి తిరగవద్దు అనే హెచ్చరికతో బోర్డు ఉంటుంది. అయితే కొందరు తెలిసి .. లేక తెలియక చెప్పులు వేసుకుని ఈ వీధుల్లో తిరుగుతూ ఉంటారు.
పువ్వులు పెట్టుకోవడం: తిరుమల క్షేత్రంలో వికసించే ప్రతి పువ్వుని స్వామివారి కైంకర్యానికి ఉపయోగిస్తారు. అంతే కాదు శ్రీవారి సేవకు ఉపయోగించిన ప్రతి పువ్వుని ఎవరికీ ఇవ్వరు.. వాటిని భూ తీర్ధంలో చూపించి అడవిలో వదిలి వేస్తారు. అందుకనే తిరుమల క్షేత్రంలో మహిళలు పువ్వులు పెట్టుకోరాదు అని పెద్దలు చెప్పడమే కాదు.. అనేక ప్రాంతాల్లో బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. కానీ చాలామంది ఈ నిబంధనను పట్టించుకోకుండా పువ్వులు పెట్టుకుని స్వామివారి దర్శనం కోసం ఆలయం లోపలకు వెళ్లారు. అక్కడ స్వామివారి సేవకులు ఈ విషయంపై తరచుగా హెచ్చరిక చేస్తూ ఉంటారు.