Angelo Mathews timed out in Sri Lanka vs Bangladesh World Cup match: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య 38వ మ్యాచ్ జరుగుతోంది.
బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేస్తోన్న శ్రీలంక 27 ఓవర్లలో 5 వికెట్లకు 149 పరుగులు చేసింది.
కాగా, ఈ సమయంలో మ్యాచ్‌లో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏంజెలో మాథ్యూస్ ఒక్క బంతి ఆడకుండానే పెవిలియన్ చేరుకున్నాడు. అది కూడా షాకింగ్ రీజన్‌తో ఔట్ అయ్యాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇలా అవుట్ అయిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
41 పరుగుల వద్ద సదీర సమరవిక్రమ ఔటయ్యాడు. షకీబ్ అల్ హసన్ బౌలింగ్‌లో మహ్మదుల్లా రియాద్ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. అయితే, ఈ సమయంలో శ్రీలంక సీనియర్ ప్లేయర్ ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి రావాల్సి ఉంది. కానీ, ఆయన సమయానికి క్రీజులోకి రాలేదు. దీంతో బంగ్లాదేశ్ టీం అంపైర్‌కు అప్పీల్ చేసింది. అంపైర్ కూడా బంగ్లా అప్పీల్‌ను సమ్మతించి, ఏంజెలో మాథ్యూస్‌ను టైం ఔట్‌గా ప్రకటించారు.
మాథ్యూస్ టైం ఔట్ ఎలా అయ్యాడంటే?
మాథ్యూస్ క్రీజులోకి వచ్చి బంతిని ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే, అతని హెల్మెట్‌ను ధరించే సమయంలో ఓ పట్టీ విరిగిపోయింది. ఇటువంటి పరిస్థితిలో అతను మరొక హెల్మెట్‌ను ఆర్డర్ చేశాడు. తొలి బంతిని ఆడడంలో ఆలస్యం జరిగింది. వాస్తవానికి, చివరి వికెట్ పడిపోయిన 3 నిమిషాలలోపు బ్యాట్స్‌మన్ బంతిని ఆడటానికి సిద్ధంగా ఉండాలి. అలా జరగని పక్షంలో, ఫీల్డ్ అంపైర్ అప్పీల్‌పై ఔట్ చేయవచ్చు.
ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయంటే..
"ఒక వికెట్ పడిపోయిన తర్వాత లేదా బ్యాటర్ రిటైర్మెంట్ తర్వాత, తర్వాత వచ్చే బ్యాటర్, సమయానికి క్రీజులోకి చేరుకుని, బంతిని ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. ఇదంతా 3 నిమిషాల్లోపు జరగాలి. అంటే 3 నిమిషాలలోపు బంతిని ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. ఇందులో విఫలమైతే, ప్లేయర్‌ను టైం ఔట్‌గా ప్రకటించొచ్చు" అని MCC రూల్‌బుక్ పేర్కొంది.
ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఏదైనా ఫార్మాట్‌లో ఇంతకు ముందు ఆరు సార్లు మాత్రమే బ్యాటర్ టైం అవుట్ అయ్యాడు. కాగా, ఇలా తొలిసారి ఔటైన అంతర్జాతీయ ప్లేయర్‌గా ఏంజెలో మాథ్యూస్ నిలిచాడు.
ఇరు జట్లు:
శ్రీలంక (ప్లేయింగ్ XI): పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(కెప్టెన్/కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, కసున్ రజిత, దిల్షన్ మధుశంక.
బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్(కీపర్), మహ్మదుల్లా, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), తౌహిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, తంజిమ్ హసన్ సాకిబ్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం.